Logo
Date of Publish : 13 September 2025, 2:22 pm
Editor : Sake Naresh

అద్భుతాల నిల‌యం శ్రీవారి ఆలయం – తిరుమల తిరుపతి దేవస్థానం

           తిరుమల, 2025 సెప్టెంబరు 12 : తిరుమల శేషాచలగిరుల్లో వెలసిన శ్రీవేంకటేశ్వర స్వామివారి ఆలయం క్రీ.పూ. 12వ శతాబ్దంలో 2.2 ఎకరాల విస్తీర్ణంలో, 415 అడుగుల పొడవు, 263 అడుగుల వెడల్పుతో నిర్మించబడింది. శ్రీవారి ఆలయంలో మొత్తం మూడు ప్రాకారాలు ఉన్నాయి. ఆలయ గోడలు వెయ్యేళ్ల క్రితం నాటివని శాసనాల ద్వారా తెలుస్తోంది. ఆలయంలో ఆభరణాలు, పవిత్రమైన వస్త్రాలు, తాజా పూలమాలలు, చందనం తదితరాలను భద్రపరచుకునేందుకు వేర్వేరు గదులు ఉన్నాయి. వీటితో పాటు లడ్డూ ప్రసాదం తయారీకి పోటు, శ్రీవారి నైవేద్యం తయారీకి ప్రత్యేక వంటగదులు ఉన్నాయి. శ్రీవారి ఆలయ అభివృద్ధికి ఎన్నో రాజవంశాలకు చెందిన రాజులు, రాణులు, సేనాధిపతులు, ఇంకా ఎందరో భక్తులు విరాళాలు అందించి సహకరించారు. అద్భుత నిర్మాణంగా నిలిచిన శ్రీవారి ఆలయంలో పలు ఉప ఆలయాలు, మండపాలు కొలువుదీరాయి. తిరుమల శ్రీ‌వారి ఆల‌యంలోని మండ‌పాలను ఆనాటి చ‌క్ర‌వ‌ర్తులు, రాజులు అద్భుత‌మైన శిల్ప‌క‌ళా నైపుణ్యంతో నిర్మించారు. ఇవాటిలో మ‌హాద్వారం, కృష్ణరాయ మండపం, రంగనాయక మండపం, తిరుమలరాయ మండపం, అద్దాల మండపం (ఆయినా మహల్‌), ధ్వజస్తంభ మండపం, కళ్యాణ మండపం తదితరాలు ఉన్నాయి. ఇక్కడి పైకప్పులు, స్థంభాలపై కృష్ణ‌స్వామివారు, ల‌క్ష్మీ న‌ర‌సింహ‌స్వామి, వ‌రాహ‌స్వామి, శ్రీ వేంక‌టేశ్వ‌ర‌స్వామి తదితర దేవతామూర్తులు, ల‌క్ష్మీదేవి అమ్మ‌వారి వివిధ రూపాలు, జంతువులు, ల‌త‌లు, పుష్పాలతో కూడిన శిల్పాలు సుందరంగా తీర్చిదిద్దబడ్డాయి.

          ప్రధాన గోపురం లేదా మ‌హాద్వారం 13వ శ‌తాబ్దంలో నిర్మించబడిందని ఆల‌యంలోని శాస‌నాలు తెలియజేస్తున్నాయి. ఇక్కడే కుడిగోడపై అనంతాళ్వారులు ఉపయోగించిన గునపం వ్రేలాడదీయబడి ఉంటుంది. మహాద్వారానికి ఆనుకొని లోపలి వైపున 16 స్థంభాల‌పై ముస‌లిపై ఉన్న సింహం, దానిపై కూర్చుని స్వారీ చేస్తున్న వీరుల శిల్పాలతో కూడిన ఎత్తైన మండపమే కృష్ణరాయ మండపం. ఈ మండ‌పంలో కుడివైపున తిరుమల దేవి, చిన్నాదేవిలతో కూడిన శ్రీకృష్ణదేవ‌రాయల నిలువెత్తు రాగి ప్రతిమలు ఉన్నాయి. ఎడమవైపు చంద్రగిరి రాజైన వెంకటపతి రాయల రాగి ప్రతిమ, ఆ పక్కన విజయనగర ప్రభువైన అచ్యుతరాయలు, ఆయన రాణి వరదాజి అమ్మాణ్ణి నిలువెత్తు నల్లరాతి ప్రతిమలు నమస్కార భంగిమలో ఉన్నాయి. శ్రీవారి ఆలయంలోని రంగనాయక మండపాన్ని శ్రీరంగనాథ యాదవరాయలు క్రీ.శ. 1310–1320 మధ్యకాలంలో నిర్మించారు. ఈ మండ‌పంలో వివిధ రకాల శిల్పాలతో సుందరంగా నిర్మాణం జరిగింది. క్రీ.శ. 1320–1360 మధ్యకాలంలో శ్రీరంగంలోని శ్రీరంగనాథుని ఉత్సవమూర్తులు ఈ మండపంలో భద్రపరచబడ్డాయి. అందువల్లే దీన్ని రంగనాయక మండపమని పిలుస్తారు.

       రంగనాయక మండపాన్ని ఆనుకుని పడమర వైపున ఉన్న ఎత్తైన స్తంభాల మండపమే ఊంజల్ మండపం లేదా తిరుమలరాయ మండపం అంటారు. ఈ మండపంలోని వేదిక భాగాన్ని క్రీ.శ. 1473లో సాళువ నరసింహరాయలు నిర్మించగా, క్రీ.శ. 16వ శతాబ్దంలో సభాప్రాంగణ మండపాన్ని ఆరవీటి తిరుమలరాయలు నిర్మించారు. ఇందులోని స్థంభాలపై శ్రీ వైష్ణవ, పశు–పక్షాదుల‌ శిల్పాలు చెక్కబడ్డాయి. ఈ మండపంలో రాజా తోడర‌మ‌ల్‌, అతని తల్లి మాతా మోహ‌నా దేవి, భార్య పిటా బీబీ లోహ విగ్రహాలు ఉన్నాయి. బ్రహ్మోత్సవ సమయంలో ధ్వజారోహణం నాడు శ్రీవారు ఈ మండపంలోనికి వేంచేసి పూజలందుకుంటారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • ప్రపంచం
  • క్రీడలు
  • సినిమా
  • క్రైమ్ న్యూస్
  • ఆరోగ్యం
  • ఉద్యోగాలు
  • రాజకీయాలు
  • టెక్నాలజీ
  • వీడియోలు
  • Copyrights Reserved 2024
  • Developed by RaamSee Technologies